మూలం: మా నాన్న Shri. VLNSK గారు రాసిన బ్రతుకు సుఖం(1979)
ముకుంద్ శేఖర్ నది ఒడ్డున కూర్చుని వస్తున్న - పోతున్న పడవలు ఒకదానిని మరోకటి దాటడం చూస్తున్నాడు. దూరంగా సూరీడు టాటా బై బై చెప్పే పని లో తెడ్డు పడిన నది నీటి తరంగాలలో దోబూచులాట ఆడుకుంటున్నాడు. పొద్దున్నుంచి అందర్నీ ఒక వైపు మాడుస్తునే ఇంకో వైపు బ్రతుకు దారి చూపించి చూపించి అలసిపోయాడు పాపం. పైగా ఇక్కడ డ్యూటీ దిగి ఇంకో వైపు ఎక్కాలి... కొంచెం సేపు ఇలా ఆడుకుంటే తప్పేముంది అనుకున్నాడు. ఒక పడవ లో అటు ఒడ్డుకు వెళుతున్న అలసిపోయిన పెద్దోళ్ళు ... వాళ్ళ మీద నీళ్లు చల్లుతూ ఇటు ఒడ్డుకు వస్తూ అల్లరి చేస్తున్న కురోళ్లు మరో పడవ లో. వాళ్ల గోల మనకెందుకు అనుకుంటూ కొంచెం దూరంగా వయ్యారాలు పోతూ ఈదుతున్న బాతులు ... వాటి పైన గుడ్లూ చేరుకోవాలి అని ఎగురుతున్న పక్షులు. రసికత ఉండాలే కాని ఈ సీన్ ని సీనరి నీ చూస్తూ అలా ప్రకృతి నీ వర్ణిస్తూ గడిపెయొచ్చు. కానీ ... మన ముకుంద కళ్ళలో ఏవో దిగులు నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. అవి తెర దాటి రావు ... మన వాడి బాధ భారం కొండ దిగదు. ఇంత ఆనందం తన చుట్టూ ఉన్న అనుభవించలేని కష్టాన్ని కడిగే పని లో ఉన్నట్టు ఉంది నది ... వచ్చి చల్లగా పదాలు తాకుతోంది ... మరో వైపు నేనేమన్నా తక్కువా అంటూ నది గాలి కూడా గట్టిగా తగులుతోంది ... ముకుంద చొక్కా దాని తో పాటు రాగాలు తీస్తోంది కాని ఇక్కడ మనోడు అదే expression ... ఇంక రాలకపోతే కష్టం అని కన్నీరు తెర దాటి కిందకు రాలింది.
అలా చూస్తుండగానే చీకటి పడి చంద్రుడు నడి నెత్తి కి ఎక్కేసాడు. నది గాలి కూడా జోరందుకుంది. ముకుంద చొక్కా, ప్యాంటు, జుట్టు ఎవి కూడా ఇంకా ఎంతసేపు ఇక్కడే ఇలాగే ఉంటాం అని ఆ గాలి తో పాటు ఎటో వెళ్లాలి అనే ప్రయత్నం లో ఉన్నాయి... కానీ మనోడు కదలడం లేదు. ఎంతో సేపు భారం మొసి మోసి కళ్ళు ఏర్రపడ్డాయి ... మొహం పీక్కు పోయింది. తిండి లేక ఇబ్బంది పడ్డ పెదవులు ఎండిపోయి కనీసం నీళ్లు అయిన పట్టమని అడుగుతున్నాయి. అయినా కరగని చిత్తం తో ... తీరని బాధ ఏదో నమిలేస్తుంటే అలాగే ఉండిపోయాడు ముకుంద. చివరికి ఏదో నిర్ణయానికి వచ్చి లేచాడు. కానీ కాళ్ళల్లో సత్తువ ఆట్టే లేదు నది ఒడ్డు జరాడు. పిచ్చి కోపం తో లేచి ... ఉన్న సత్తువ అంతా కూడగట్టుకుని పెద్ద రాయి తో నది ని కొట్టాడు. అతను విసిరిన తీరు కొట్టినట్టే ఉంది మరి. ఎవరి మీద కోపమో ... మొత్తం కట్టలు తెంచుకుంటోంది ... నదిని శిక్షించక ఇంకా ఆవేశం గా ఆకాశం వైపు ఇంకా కోపం గా చూశాడు. ఈ సారి కాస్త చిన్న రాయి తీసుకుని పైకి విసిరాడు ... ఇంకా కోపం తగ్గక ఆవేశం గా అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడే పెద్ద పూజారి గారి మంగళ హారతి గట్టిగా వినపడింది. ముకుంద ఇంకా ఆవేశం గా పెద్ద పెద్ద అంగలు వేస్తూ గుడి కి బయలుదేరాడు. ఎవరు పిలిచారో మరి..?!
దారి లో అతనికి ఇంకా కొత్త మోజు తీరని ఒక పాత జంట కంటపడింది. వయసు ఒంటికే కాని మనసుకు కాదు అని గట్టిగా నమ్మినట్లు ఉన్నారు ఇద్దరూ ... ఆయన చిలిపి అల్లరి కి ఆవిడ కొంటే కోపం చూపిస్తూ ... ఆవిడ ఆలక కి ఆయన పిల్లాడల్లే సమాధానం ఇస్తూ ... మళ్ళీ కవ్విస్తూ ... నేనేమన్నా తక్కువా అంటూ ఆవిడ కూడా ఉడికిస్తుంటే ఎంత సేపు అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడో ... చేతికి వాచి లేక టైం తెలిలా. అలా ఇంకొకళ్ళ గుడిసెలో కి ఎక్కువ సేపు చూస్తూ ఉండకూడదు అని చెప్పే వాళ్ళు ... ఆపే వాళ్ళు లేరు మరి. ఆ జంట రోజంతా ఎంత కష్టపడి ఆ ముద్ద తెచ్చుకుందో... ఎవరి తో సంబంధం లేదు అన్నట్టు మురిసిపోతోంది. అలసిపోయి అల్లరి ఆపేసి ఎవరి పక్క మీద వారు చేరారు ఆ జంట. అలాంటి జీవితానికి తను నోచుకోలేదు అనే కోపం ఉందేమో ముకుంద లో ముప్పై ఏళ్లకే ... ఇంకా వడి వడి నడక తో గుడి వైపు కదిలాడు. ప్రతి అడుగు అతని చిన్నప్పటి బుడి బుడి అడుగులు లాగే ఉన్నాయి. కాస్త తడబాటు ... ఇంకాస్త తొందరపాటు ... అప్పుడు పట్టుకుని నేర్పించే తల్లి తండ్రి పక్కన లేరు ... మరి వాళ్ళని వెత్తుకుంటునే వెళ్తున్నాడో ఏమో ..?!
మొత్తానికి గుడి చేరాడు. ఎవ్వరూ లేరు ... అవును చీకట్లో నిద్ర దేవత తో చర్చల్లో ఉంటాం కాని గుళ్ళో దేవుడ్ని ఇబ్బంది పెట్టం కదా! గుడి చిన్నదే కాని పాతది ... ఎన్నో కథలు ... మహిమ గల దేవుడని పేరు ... ఉత్సవాలు చేస్తే జనం తో కిట కిట ... అబ్బో ఆ పది రోజుల వైభవం గురించి 350 రోజులూ చెప్పుకుంటూ ... మిగిలిన రోజుల్లో పెద్ద గా పట్టించుకోకపోయినా ఏమి అనని జాలి గుండే ఉన్న మూర్తి ... ప్రసాదం కోసం ... పండగలకి ... శుక్రవార శనివారాల్లో వచ్చే అమ్మాయిలకి కాసేపు బీటు కొట్టుకుండమని వచ్చే ముకుంద ఈ సారి మాత్రం పెద్ద హోమగుండం గుండెల్లో మోసుకుంటూ వచ్చాడు. కాసేపు బయటే ఉండి చూసి చూసి ... దగ్గర్లో ఉన్న రాయి తీసుకుని గేటు తాళం బద్దలు కొట్టే ... తరువాత ఏకంగా గర్భగుడి తాళం కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. మూర్తి నీ చూస్తూ ... ఎన్నో ప్రశ్నలు ఉన్నా ఏమడగాలో ... ఎలా అడగాలో తెలియక ... ఇంక అడగటం వ్యర్థం అనుకుని పక్కనే ఉన్న పెద్ద దీపపు కుంది అందుకుని పొడుచుకోబోయాడు. అంతలో ...
"ఆగు ... ఆగు ... ఎక్కడా చోటు దొరకనట్టు ... ఇక్కడ కి వచ్చే చావలా? అది కింద పెట్టి పో ఇక్కడి నుంచి ..!" అని వినబడింది. పెద్ద పూజారి వచ్చేసాడ అని వెనక్కి తిరిగి చూశాడు ... ఎవ్వరూ లేరు. మూర్తి వైపు చూశాడు... చలనం లేదు ... ఉండే అవకాశం కూడా లేదు.. తన భ్రమ భ్రాంతి అనుకుని ... కళ్ళు గట్టిగా మూసుకుని .. మళ్ళీ కుంది పైకెత్తాడు ... ఈ సారి ఎవరో లాగినట్టు అనిపించి కళ్ళు తెరిచాడు ... ఎదురు గా అనంతుడు ... అదే దేవుడు. చుట్టూ చూశాడు ... సినిమాల్లో లా గంటలు మోగలేదు ... దీపాలు వాటంతవే వెలగలేదు ... మూర్తి కూడా అలాగే ఉంది. కానీ ఆపే మనిషి లో మాత్రం తేజస్సు ... నేరుగా చూడాలి అంటే భయం వేసేంత తీక్షణంగా చూపు ... దివ్య మోహనం గా రూపం... అర్థం కాక ఆలోచన లో పడ్డాడు ముకుంద. "చివరకి ... ఇదొక్కటే మీ మనుషులు చెయ్యకుండా ఉంది ... ఇది కూడా చేసి నా గుడి మూయించకు ... అసలే ... పది రోజుల ఉత్సవం కోసం మాత్రమే ఇంకా ఇది ఉంచారు ... లేదంటే ఎప్పుడో ఏ road extension లో నో... రింగు రోడ్డు ప్లాన్ లో నో కూలిపోయి ... నా మూర్తి ఏ exhibition కో... ఇంకో ప్లేస్ కో transfer అయిపోయేది. బా .. బ్బాబు.. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఈ ప్రోగ్రాం మార్చుకో ... ప్లీజ్!" అని అన్నాడు అనంతుడు.
ఏమి అర్ధం కాక ... అలా ఆశ్చర్యం గా చూస్తూ ఉండిపోయాడు ముకుంద. "నేను ... నిన్ను చావొద్దు అనడం లేదు ... మళ్ళీ అది మా free will కి అడ్డం పడటం అంటారు ... నీకేం తెలుసు మా కష్టాలు నువ్వేప్పుడైన మనుషుల కష్టాలు అనుభవించావా ... నీకు రాయి లా చూడటమే వచ్చు ... మేము పోయినా... ఎంత మొత్తుకున్నా... ఎన్ని మొక్కుకున్నా ... ఆర్చవు... తీర్చవు అంటూ మోనోలాగ్ అందుకుంటారు ... ఎందుకొచ్చిన బాధ నాకు ... వెళ్ళు!" అని తన గోడు వెళ్లబోసుకున్నాడు అనంతుడు. ఇదేం విడ్డూరం! అనే expression పెట్టి అలాగే చూస్తూ ఉండిపోయాడు ముకుంద. ఇంక ఇలా కాదు అని అనంతుడు చిన్న గా ముకుంద చెంప మీద చరిచాడు. ఒకే సారి అనంత లోకాలు చూసిన అనుభూతి కలిగి తేరుకున్నాడు మనోడు. "ఇంక నువ్వు పోతే తలుపులు వేసుకుంటా .." అని అనంతుడు దారి చూపించారు.
పూర్తి గా కోపం నషాళానికి అంటిన ముకుంద ... "అస్సలు ... మీ స్కీం ఎంటి సార్ ... పుట్టిస్తారు ... కానీ బ్రతకాలి అనే ఆశ చంపేస్తారు ... చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు కామెడీ గానే ఉంది తప్ప ... దీని వెనక ఉన్న కష్టం పట్టించుకోరు. నిజం గా మీరు రాయి కాబట్టే ... మా జీవితాలు ఇలా తగలబడి పోతున్నాయి. ఎంత మంది ఎన్ని సార్లు ఎన్ని రకాలు గా పిలిచిన పలకరు ... కరగరు ... మళ్ళీ మీకు ఉత్సవాలు... జాతరలు... పెద్ద పెద్ద గుడులు ... వాటి కోసం కొట్లాటలు ... అవి కట్టి జన్మ ధన్యం అనుకునే మూర్ఖులు..." అంటూ ఇంకా తన బాధ అంతా చెప్పబోతుంటే ... అనంతుడు అతని పేదల మీద తన వేలు పెట్టి ఆపేశాడు.
"ఇదే ... ఇదే వద్దు అన్నది. మీ నాయకుల ఓట్ల కి ఉపయోగపడి... మీరు నమ్మే స్వామీజీ లకి ఉపయోగపడి ... నీ లాంటి వాళ్ళు సైట్ కొట్టుకోవడానికి ఉపయోగపడి ... మళ్ళీ హుండీ ఆదాయం తో ఏవో మంచి పనులు చేస్తాం అంటే వాళ్ళకి ఉపయోగపడి ... నా గుడి చుట్టూ వ్యాపారాలు ... గుడి మీద రాజకీయాలు చేసే వాళ్ళు ... గుడి వెనుక దొంగలు ... గుడి పేరు చెప్పి దోచే దోంగలు ... ఎన్నో పాపాలు చేసినా ఒక పూజ, రెండు దానాలు, నాలుగు హోమాలు చాలు అని చెప్పే వాళ్లు ... ఇలా నన్ను వాడుకునే వాళ్ళు తప్ప వెడుకునే వాళ్ళు కనపడకే .. ఇలా ఉండటమే మంచిది అనుకున్న!" అన్నాడు అనంతుడు.
"నీ వల్ల మేము కాని మా వల్ల నువ్వు కాదు అంటారు. కానీ నువ్వు చెప్పేది మా వల్లే నువ్వు అన్నట్టు ఉంది!" అని గట్టిగానే జవాబు ఇచ్చాడు ముకుంద. "నిన్ను .. ఇక్కడ ఆత్మహత్య చేసుకోకు అని చెప్పే హక్కు నాకు లేదు అంటావా" అని అనంతుడు గదమాయించాడు.
"నా చావు కోరుకునే వాడికి ఎక్కడ అయితే ఏమిటి తేడా అంటున్నాను!" అని మళ్ళీ భయపడకుండా జవాబు ఇచ్చాడు.
"నీ చావు నీ కోరిక ... నాది కాదు." అన్నాడు అనంతుడు
"దానికి దారి తీసిన పరిస్థితులు నీ screenplay నే కదా కాదు అంటావా?" అని ప్రశ్నించాడు ముకుంద.
"అసలు నీ పేరేమిటి?" నువ్వెవరు అసలు అనే టోన్ లో అడిగాడు అనంతుడు.
"ప్రతి ప్రాణి నా వల్లే పుట్టింది... నేను చెబితేనే ఏ పనైనా చేస్తుంది అని నువ్వే గా చెప్పావు" అని జవాబిచ్చాడు ముకుంద.
"కదా ... మరి గుడి కి వచ్చి అర్చన అప్పుడు నీ గోత్ర నామాలు చెప్పడం దేనికి? నేను సృష్టించిన పూలు పండ్లు ... వాటి తో చేసిన పదార్ధాలతో మళ్ళీ నాకే నైవేద్యం పెట్టడం దేనికి? అంటే నువ్వే ఈ పూజ చేయిస్తున్నావ్ అని నాకు తెలియడానికా? నీ పక్కన వాళ్ళకి తెలియడానికా? నాకు బంగారు ఆభరణాలు నా వైభవం కోసమా? నీ వైభవం జనానికి చూపించడానికా? నీ ధర్మాల కోసం నేను నా భార్య ను వెళ్లగొట్టాను అన్నావు ... నీ వక్రబుద్ధి తో నన్ను భార్యాలోలుడు ... పచ్చి గా చెప్పాలి అంటే స్త్రీ లోలుడు అన్నావు... నేను చెప్పిన మాటల్లో నిగూఢ అర్ధలకి అపార్ధాలు తీశావు ... నేను చూపించిన దారి నీ నీకు అనుకూలం గా వంద వంక్రలు తిప్పావు ... నా కోసం యుద్ధాలు చెయ్యమన్నానా? నేను చెప్పిన మంచి ప్రచారం చేయమంటే నేను మాత్రమే నిజం అంటూ ఇంకొకరి నమ్మకం మీద నీళ్లు పోయామన్నాన? అవమానించి అసహ్యాహించుకోమన్నాన? నువ్వు నన్ను ఏ రూపం లో నమ్మిన అడ్డు చెప్పలేదు ... పిలిస్తే పలికాను... ఏ రూపం లో ఉన్న నేను నేనే ... ఆ రూపం లో నేను వేరు ఈ రూపం లో నేను ఇంకెవరో అనుకున్నది మీరే ... కనుక నేను మీకు ఇంతే ...!" అని చెప్పాడు అనంతుడు.
"అంటే ... ఎవరో చేసిన దానికి నేను బాధ్యుడినా? అందుకే నా నన్ను ఇలా వేధిస్తున్నవు? అందర్నీ కోల్పోయి ... ఏ ఆనందానికి నోచుకోని నేను బ్రతికి ఎం చేయాలి?" అంటూ బాధ తో అనంతుడి వైపు చూశాడు.
అనంతుడు చిరు మందహాసంతో చిటికె వేశాడు. అతని మూర్తి స్థానం లో మరో ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు.
"నా ముందు చెయ్యాలి అనుకున్న పని వీళ్ళ ముందు చెయ్యి చూద్దాం! వాళ్ళు నిన్ను ఆపరు ... ఆపలేరు. నేను ఆపను.." అని తన చేతులు వెనక్కి పెట్టుకుని తను రెండు అడుగులు వెనక్కి వేశాడు.
తన తల్లదండ్రుల్ని అలా చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు ముకుంద. అతని కళ్ళల్లో ఎన్నో బాధలని దిగమింగి దిగమింగి ఊరిపోయిన నీళ్లు ధారాపాతం లా కారుతూనే ఉన్నాయి. ఆ మూర్తులు ఇద్దరి లో అతని మీద ప్రేమ వాత్సల్యం కనపడుతున్నాయి. ఎదురుగా ఉన్న బిడ్డడిని ఆపలేక హత్తుకొలేక బాధ పడుతున్నారు ... ఏ కదలిక లేకుండా అలాగే ఉండిపోయిన కొడుకుని చూసి వారి లో ఆందోళన పెరిగిపోతోంది. ఇలా కట్టి పడేసినందుకు కళ్లతోనే చంపేసేలా చూశారు ఆనంతుడి వైపు. చిద్విలాసం తో అలాగే ఉన్నాడు అనంతుడు. చివరికి మోకాళ్ళ మీద కుప్పకూలి ... కుంది పక్కన పడేసి తల్లితండ్రుల కాళ్ళ మీద పడ్డాడు. తల పైకి ఎత్తి చూస్తే వాళ్ల కళ్లలో నవ్వు కనపడింది.
"నువ్వు కష్టాలు అన్నావు ... వాళ్ళు నిన్ను ఏ కష్టాలు పడకుండానే పెంచారా? వాళ్ళు నీ బ్రతుకు కోరుకున్నారు కోరుకుంటునే ఉంటారు. వాళ్ల కోసం బ్రతుకుతున్నా అనుకో ... అంత పెద్ద యుద్ధం చేయడానికి నేను చెప్పిన గీత ... నీ లో నువ్వు చేసే అంతర్యుద్ధానికి బాటా చుపదా? నిన్ను నువ్వు తెలుసుకో ... నేను చెప్పిన మాటల్లో ఉన్న అర్థం .. తర్కం తో ఆలోచించి గ్రహించు. నేను చెప్పాను అని చేసే మోసాన్ని గ్రహించు ... అప్పుడు నన్ను ఈ మూర్తి లో కాదు నీ లో వేతుకుతావు ... నీలో ఉన్న నేను నీ కోసమే ఉంటాను ... నువ్వై ఉంటాను ... అది అర్ధం చేసుకునే వరకు నన్ను ఎక్కడ వెతికినా కనపడను. నువ్వు నీలా ఉండటం లో ఆనందం లేదు అనుకుంటే నీ చావు లో కూడా నీకు ఆనందం కనపడదు...!"
ఈ మాటలు వింటు తల పైకి ఎత్తిన ముకుంద మీదకి వెచ్చని సూర్యకాంతి తాకింది. కళ్ళు తెరిచి చూసేసరికి గూడు లో చిన్న పక్షి కి తల్లి పక్షి మురిపెం గా ముద్దు పెట్టుకొని దాణా కోసం ఎగిరి వెళ్ళడం కనపడింది. నిన్న కనపడ్డ ముసలాయన నవ్వుతూ నదికి ఆ గట్టుకి తెడ్డు వేయడం కనపడింది. పొద్దున్నే స్కూల్ కి వెళ్ళడానికి కొందరు నవ్వుతూ కొందరు విస్సుకుంటు ఆ గట్టు దగ్గరికి రావడం కనపడింది. సూర్యుడు మళ్ళీ నది నీళ్లలో తన బింబం తో ఆడుకుంటూ తన పని అంతే ఉత్సహం గా చెయ్యడం కనపడింది. అన్ని చూస్తూ ఈ సారి ముకుంద శేఖర్ నవ్వుతూ నది గట్టు దాటి తన దారి పట్టాడు...
Comments
Post a Comment