గణేష్--జస్ట్ గణేష్
ముందు మాట::
ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న రామ్ నటించిన కొత్త సినిమా గణేష్ పాటలు విడుదలయ్యాయి. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఎమ్.శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెఢీ తరువాత రామ్ తో స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రమిది. మిక్కి జె.మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం......
తనేమందో.............
రాసిన వారు:: సిరివెన్నెల సీతారామశాస్త్రి
పాడిన వారు:: జావేద్ అలీ
పాట టైటానిక్ సంగీతం బీట్ తో మొదలౌతుంది. వింటున్నంత సేపు ఎక్కడో విన్నట్టుగానే ఉంటుంది. ఇంకా హ్యాపీ డేస్ మత్తు వదలలేదు మిక్కి గారికి. జావేద్ అలీ గొంతులో తెలుగు అంతగా కూనీ కాకపోవడం కాస్త హర్షించదగ్గ విషయం. పాటకి తగినట్టుగా ఉంది అతని గానం. శాస్త్రి గారు ఎప్పుడూ రాసే భావాలే.......కొత్తదనం లేని పాట.
లలల్లలయ్..........
రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు:: కృష్ణ చైతన్య, శ్వేతా పండిట్
పాట పూర్తిగా ’ఒకే ఒక్కడు’ సినిమాలోని ’ఉట్టి మీద కూడు’ తరహాలో నడుస్తుంది. దరువు పాట ఒక్కటైనా ఉండాలని చేసినట్టు ఉన్నారు. రామజోగయ్య గారి లిరిక్స్ పాటకి తగినట్టు గానే ఉన్నాయి. పాడిన వారు ఫర్వాలేదు అనిపించేలా పాడారు. గోంతుల్లో ఇలాంటి పాటని నిలబెట్టేంత ఊపు లేదు.
ఎలే ఎలే.............
రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు:: శ్రీ మధుమిత
సి.డి కవరు మీద ఏలే..ఏలే అని రాసి ఉంది. పాడిన వారేమో ఎలే..ఎలే అని పాడారు. ఎవరిది కరెక్టో.? మళ్లీ వినాలనిపించేలా ఉంది పాట. రామజోగయ్య గారి లిరిక్స్ ఫర్వాలేదు. మంచి మెలోడి. కాస్త కొత్తగా ఉంది. పాడిన పద్ధతీ కొత్తగా ఉంది. మధుమిత బానే పాడింది.
రాజ్ కుమారి..
రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు:: కునాల్ గాంజావాలా, శ్రీ మధుమిత
స్లో బీట్ పాట అయినా కునాల్ వాయిస్ వల్ల పాట ఉత్సాహబరితంగా ఉంది. అతనితో మధుమిత గోంతు అంతగా కలువలేదు. ఇంకో ఫర్వాలేదు పాట.
చలో చలోరే........
రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు:: కార్తిక్ & కిడ్స్ కంపెనీ
పాట వింటున్నంత సేపు ఎక్కడో విన్న భావన ఉంటుంది. లిరిక్స్ హీరో పిల్లలని ఆకట్టుకోవడానికి రాసారు. కానీ పిల్లల కోసం రాసామంటూ కొన్ని అసంభవ పనుల్ని......అనగా...."ఎ.టి.ఎం లో ఐస్ క్రీం తీస్తా"..........అని రాయాడం ఎంతవరకూ సమంజసం. పైగా "క్వశ్చన్ పేపర్స్ ముందే ఇస్తా" అని కూడా రాసారు. ఇది హీరోయిజం కోసం రాసిందైతే ఇదేం హీరోయిజం?? కార్తిక్ బాగా పాడాడు.
రాజా మహారాజా..........
రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు:: రంజిత్
విఘ్నేశ్వరుడిని హీరో స్మరిస్తూనే లోకానికి మంచి చేబుతున్నట్టు రాసిన ఫక్తు రోటిన్ పాట. హ్యాపీ డేస్ పాటల్ని వింటున్నట్టు ఉంటుందీ పాట. గణేశుడిని కీర్తిస్తూ చాలా పాటలు వచ్చాయి వాటిలో కాస్త స్లో గా ఉంటూ ఇదో వేరైటీ అవుతుందని చేసినట్టున్నారు ఈ పాట. రంజిత్ పాటకి తగినట్టు గానే పాడాడు.
చివరి మాట::
ఫర్వాలేదు అనిపించే పాటలు. మిక్కి జె.మేయర్ గారు కాస్త హ్యాపీ డేస్ నుంచీ బయటికి వస్తే బాగుంటుంది. రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ చాలా రోటీన్ గా ఉన్నాయి. ఇది ఒక్కసారి వినదగ్గ ఆల్బమ్.
రేటింగ్:: 3/5
Comments
Post a Comment