ఈ సినిమాని నేను రిలీజ్ అయిన రెండో రోజే చూసాను కానీ అప్పట్లో రాయలేదు. ఇప్పడు మళ్లీ చూసాను.......రాస్తున్నాను. సినిమాని మన పాప్యులర్ మసాలా సినిమాగా చూస్తే అస్సలు నచ్చదు. అవ్వటానికి మసాలా కధే అయినా ఈ సినిమాని తీసిన విధానం కొత్తగా ఉంటుంది. కాస్త అస్తవ్యస్తంగా కూడా ఉంటుంది. అర్ధం అవ్వడం కష్టం. కానీ అర్ధమయితే మజా వస్తుంది.
ఇదో ఇద్దరు కవలల కధ. ఒకరు తప్పుడుదారిలోనైనా తన కలని నేరవేర్చుకుంటే మరొకరు ఊహించని మలుపు వల్ల కలని వదులుకుంటాడు. మనకి ప్రతిరోజూ జీవితంలో ఇలాంటి వారు కనబడుతూనే ఉంటారు. ఇద్దరికి మాటాలాడటంలో తడబాటు. ఒకరు ’క’ ని ’ఫా’ అని పలికితే ఇంకొకరికి నత్తి. ఒకరి మార్గం తప్పు మరొకరిది ఒప్పు.
కధ చార్లీతో మొదలై అతను కల నేరవేర్చుకొవడంతో ముగుస్తుంది. తమ్ముడి పాత్ర మధ్యలో వచ్చి సమస్యలు సృష్టించినట్టు అనిపిస్తుంది. కానీ కధ ఇద్దరిది. ఇద్దరూ ముఖ్యులే. ఒక పాత్ర కధగానే చెప్పిన విధానం వల్లే చూసేవారికి తికమక కలుగుతుంది. ఎవరి వైపు నుంచి కధని అర్ధం చేసుకోవాలో తెలియదు. గందరగోళం నుంచి తెరుకుని కధని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టె సరికి సగం సినిమా అయిపోతుంది.
విషాల్ భరద్వాజ్ ఇంతకు ముందు సినిమాల్లా ఇందులో కూడా గ్యాంగ్ వార్లు, డబ్బుల కోసం ఒకరినొకరు మోసం చేసుకునే వారు కనబడతారు. అలాగే రియలిస్టిక్ గానే నడుస్తుంది. బుర్రకి విపరీతమైన పనిపెడుతుంది. నెగెటివ్ హీరో చుట్టూ కధ నడుస్తుంది. కానీ ఏ పాత్రతోనూ కనెక్ట్ కానివ్వదు. అలా అలా నడుచుకుంటూ వెళ్లిపోతుంది.అతని సంగీతం సినిమాకే పెద్ద ఎసెట్. స్క్రిన్ ప్లే తను అన్నుకున్న విధంగా కధని చెప్పడానికి తగ్గటుగానే రాసుకున్నాడు.
సినిమాటొగ్రఫీ ఇంకా బాగుండొచ్చు. డైలాగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి. సినిమా అడుగడుగునా షాహిద్ కపూర్ లోని నటుడు కనబడ్డాడు. రెండు పాత్రలని అతను చాలా చక్కగా పోషించాడు. ప్రియాంక చోప్రా పాత్ర నిడివి తక్కువైనా చాలా బాగా చేసింది. అమోల్ గుప్తే తన నటనతో ఆశ్చర్యపరిచాడు. తారే జమీన్ పర్ లాంటి సినిమాలే కాక ఇలాంటి పాత్రలు అతను అప్పుడప్పుడూ పోషిస్తే మంచిది. నటించిన కొత్తవారందరూ చాలా బాగా చేసారు.
అర్ధవంతమైన సినిమా చూడాలనుకునే వారు తప్పకచూడాల్సిన చిత్రం. గందరగోళంలా అనిపించినా చివరికి నవ్వు తెప్పిస్తుంది.
Comments
Post a Comment