బాధ కి రూపం ఉండదు
నవ్వు కి అర్ధం ఉండదు
ప్రేమ కి కొలత అక్కర్లేదు
బ్రహ్మాండం అంతా అరచేతిలో మోయక్కర్లేదు
నువ్వు నువ్వు గా ఉండు చాలు
నీ లా నువ్వు నవ్వుకుంటూ
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ
తడబడుతూ ... మళ్ళీ నిలబడుతూ
నేను లేను అని ఆగిపోకు
నేను నేర్పింది మర్చిపోకు
నా పేరు నువ్వు నా రూపం నువ్వు
నేనే నువ్వు ... నువ్వే నేను ...
నాన్న అంటే ఇంతే కదా నాన్న ..?
నువ్వుంటే ఇదే చెప్పేవాడివా..?
నేనే ఊహించుకుని అనేసుకుంటున్నానా..?
ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వాడివి కదా ...
ఇప్పుడు అడుగుతున్నా చెప్పు ...
పోనీ .. ఏంట్రా ఇది అని తిట్టు ..
శూన్యం లోని నిశీధి అంతా
నన్ను అలుముకున్న రోజు
నాకు నేను తప్ప ఎవ్వరూ..
ధైర్యం చెప్పలేని రోజు
నువ్వు రాకూడదు అనుకున్న రోజు
నేను చూస్తున్న నిజం .. కల కాలేని రోజు
ఎన్ని ఏళ్ళు గడిచినా బాధ పెంచే రోజు
నిన్ను నాలోనే వెతుక్కునే రోజు
జ్ఞాపకాల గునపం గుండె చీల్చే రోజు
ముందుకు వెళ్లే అడుగు ఆగి వెనక్కి తగ్గే రోజు
ఎదో శిక్ష ... పరీక్ష ... అనిపించే ప్రతిరోజు
నీ నవ్వు తప్ప ఏది గుర్తుకు రాని రోజు
నేను నా గమ్యం లో నిన్ను తలవని రోజు
లేదని తెలిసినా మరోసారి బాధ పెంచే రోజు
క్యాలెండర్ నన్ను వెక్కిరించే రోజు ... ఈ రోజు!!
On the occasion of my father Shri KVLN Sastry garu's death anniversary on 27th January 2026, I have written this piece
- Naresh Kota


Comments
Post a Comment